త్వరలో డీఎస్సీ ప్రకటన: సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలపై చర్చ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
త్వరలో డీఎస్సీ ప్రకటన: సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలపై చర్చ
- ప్రాజెక్టు ఆమోద బోర్డు సమావేశంలో వేతనాల అంశం
- సమగ్ర శిక్షలో జీతాలు దక్షిణాదిలోనే అత్యధికమన్న మంత్రి నారా లోకేష్
- కర్నూలుపై ప్రత్యేక దృష్టితో మరో డీఎస్సీ హామీ
అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): త్వరలోనే డీఎస్సీని ప్రకటిస్తామని, సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపుదలపై ప్రాజెక్టు ఆమోద బోర్డు సమావేశంలో చర్చిస్తామని రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ నిర్వహణ సిబ్బంది, ఇతర ఉద్యోగుల జీతాల పెంపుదలపై వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి, కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కేంద్ర భాగస్వామ్యంతో అమలవుతోందని, ఖర్చులో అరవై శాతం కేంద్రం, నలభై శాతం రాష్ట్రం భరిస్తున్నందున ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర అనుమతి అవసరమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో సీజనల్ వసతి గృహాల మంజూరుపై సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ, అవసరమైన మేరకు వంద శాతం వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఆలూరు, ఆదోని, మంత్రాలయ ప్రాంతాల వెనుకబాటుతనాన్ని ప్రత్యక్షంగా గమనించానని, ఆ ప్రాంతానికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో కర్నూలు జిల్లాకు అధిక ఉపాధ్యాయ స్థానాలు మంజూరు చేసినప్పటికీ ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తి ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ప్రకటించే మరో డీఎస్సీలో కర్నూలు పార్లమెంటు పరిధిపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యా మరియు ఉపాధి అవకాశాలను విస్తరించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Comments
