బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు.. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువత..!
బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు.. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువత..!
హైదరాబాద్ – 8 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్
స్పెయిన్‌లోని లా నూసియా వేదికగా జరిగిన బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లు సత్తా చాటారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ పురుషుల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో హుస్సాముద్దీన్ కెనడాకు చెందిన కియోమా అలీ అహ్మదియా చేతిలో 0–5తో ఓడినప్పటికీ, ఈ స్థాయి టోర్నీలో సెమీస్ వరకు చేరడం గొప్ప ఘనతగా క్రీడా వర్గాలు అభినందిస్తున్నాయి.
ఇదే టోర్నీలో పురుషుల 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్, 54 కేజీల విభాగంలో హితేశ్ గులియా కూడా సెమీఫైనల్స్‌లో పోరాడి కాంస్య పతకాలు సాధించారు. బలమైన అంతర్జాతీయ బాక్సర్లతో తలపడుతూ మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత యువ బాక్సర్ల ఆటతీరు అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన హుస్సాముద్దీన్ ఈ టోర్నీలో చూపిన ధైర్యం, ఫైటింగ్ స్పిరిట్‌పై కోచ్‌లు, క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మహిళల విభాగంలో భారత బాక్సర్లు మరింత బలమైన ప్రదర్శన కనబరిచారు. 75 కేజీల సెమీఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించగా, ప్రీతి పవార్, పూనమ్, మంజు రాణి, నీతూ గంగాస్, అరుంధతి చౌదరీ కూడా ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం. అంతర్జాతీయ వేదికపై భారత బాక్సింగ్ జట్టు చూపిస్తున్న ఈ స్థిరమైన ప్రదర్శన, రాబోయే పెద్ద టోర్నీల్లో మెడల్స్ ఆశలను మరింత బలపరుస్తోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
