కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?.. మరో భాషలోనూ అదృష్టం పరీక్షించుకోబోతోందా..!
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?.. మరో భాషలోనూ అదృష్టం పరీక్షించుకోబోతోందా..!
హైదరాబాద్ – 8 ఫిబ్రవరి పీపుల్స్ మోటివేషన్
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘777 చార్లీ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముందని టాక్. ఇదే నిజమైతే మీనాక్షి కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఇటీవల కాలంలో తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తోంది. ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో భారీ విజయాలుగా నిలిచాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షి క్రేజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు, ఆమెను స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలబెట్టింది.
ఇదే సమయంలో మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ కూడా పాజిటివ్ టాక్‌ను దక్కించుకుని వంద కోట్ల క్లబ్‌లో చేరిందన్న వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. చిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మీనాక్షి నటనకు మరోసారి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో ‘వృషకర్మ’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ భామ, కన్నడలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే అక్కడి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది
