పోలీస్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
పోలీస్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
- - హోంశాఖ బడ్జెట్ అంచనాలపై సమీక్ష
- - ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణకు ప్రణాళికలు
అమరావతి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో హోంశాఖ బడ్జెట్ అంచనాలపై పోలీస్, ఇంటెలిజెన్స్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, పోలీస్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్, ఈగల్, ఆక్టోపస్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయా శాఖల అవసరాలు, నిధుల కేటాయింపులు, బడ్జెట్ వినియోగంపై విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. పోలీస్ శాఖ ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ, సిబ్బందికి మెరుగైన వసతులు, అవసరమైన వనరులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నేర నియంత్రణలో అత్యాధునిక సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అనిత వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రత్యేక దళాల పనితీరును మెరుగుపరిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ, ఫైర్ సర్వీసెస్ డీజీ వెంకటరమణ, ఎస్పీఎఫ్ ఐజీ వెంకట రమణారెడ్డి, పోలీస్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీ అబురాజన్, ఈగల్ ఐజీ రవికృష్ణ, పీటీఐ డీఐజీ సత్యఏసుబాబు, బెటాలియన్ ఐజీ రాజకుమారి, ఆక్టోపస్ ,ఈగల్ ఐజీ సెంథిల్ కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

