అందోల్–జోగిపేటలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్–జోగిపేటలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
- వార్డుల వారీగా ప్రజలతో ముఖాముఖీ భేటీ
- సమస్యల పరిష్కారానికి కట్టుబాటు హామీ
- విద్య–వైద్య కేంద్రంగా జోగిపేట అభివృద్ధి లక్ష్యం
అందోల్ / జోగిపేట, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డుల వారీగా ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను కోరారు. మున్సిపాలిటీలో ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు, గృహలక్ష్మి, విద్యా–వైద్య రంగాల్లో సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. జోగిపేటను విద్యా, వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఏకీకృత పాఠశాలలు, నర్సింగ్ కళాశాల, హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఆధునిక ఆసుపత్రి నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు.
రాబోయే రోజుల్లో జోగిపేటలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం అందేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రచారంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, శేరి జగమ్మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, పార్టీ పరిశీలకులు కైలాష్ కుమార్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

