తూప్రాన్ అభివృద్ధి గుర్తు చేసుకోండి: హరీష్ రావు
తూప్రాన్ అభివృద్ధి గుర్తు చేసుకోండి: హరీష్ రావు
- రోడ్ షోతో హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
- బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపు
తూప్రాన్, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీలో పర్యటించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం అల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన, అక్కడి నుంచి తూప్రాన్ బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ తూప్రాన్ అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలను ఆలోచించాలన్నారు.
ఒకప్పుడు తూప్రాన్‌లో మూడు రోజులకోసారి మాత్రమే మంచినీరు వచ్చేదని, అప్పట్లో గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బిందెలతో అడ్డం పడి ప్రజలు నిరసనలు తెలిపిన పరిస్థితులు ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి నల్లా ఏర్పాటు చేసి ఆడబిడ్డల నీళ్ల కష్టాలు తీర్చారని అన్నారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీ చేయడం, ఆర్డీవో కార్యాలయం తీసుకురావడం, ఫోర్ లైన్ రోడ్లతో పట్టణాన్ని హైవేలా మార్చింది కారు గుర్తే అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ రాకముందు తూప్రాన్‌కు పిల్లనివ్వాలంటే నీళ్లు మోపిస్తారనే భయం ఉండేదని, ఇప్పుడు తూప్రాన్‌కే పిల్లనివ్వాలనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పది లక్షలు లేని భూమిని కోటి రూపాయల విలువకు తీసుకువచ్చింది కేసీఆర్ పాలనేనని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయి, బంగారం ధరలు ఆకాశానికి చేరాయని విమర్శించారు.
తూప్రాన్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, నర్సారెడ్డి–మైనంపల్లి మధ్య పోరులో ప్రజలను బలి చేస్తున్నారని ఆరోపించారు. “మీకు ఆధిపత్య రాజకీయాలు కావాలా? లేక అభివృద్ధి కావాలా?” అని ప్రజలను ప్రశ్నించారు. రెండేళ్లుగా తూప్రాన్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని, రోడ్లపై గుంతలు పడ్డా డాంబర్ వేసే దిక్కు లేదని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో పంట పంటకు రైతుబంధు అందేదని, కరోనా కష్టకాలంలో కూడా ఆపలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి రెండు రైతుబంధులు ఎగ్గొట్టారని, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేప పిల్లలు, దళిత బంధు అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నారని విమర్శించారు. “సద్ది తిన్న రేవు తలవాలి.. మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోవద్దు” అని పిలుపునిచ్చారు.
బీజేపీపై కూడా విమర్శలు చేసిన హరీష్ రావు, తూప్రాన్‌కు ఒక్క హాస్పిటల్ అయినా కట్టించారా? కల్యాణ లక్ష్మి ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, పువ్వు గుర్తుకు ఓటేసినా, ఓటును మోరీలో వేసినా ఒక్కటేనని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు అడిగితే సీఎం మాట్లాడే భాష సరికాదని, ఇలాంటి ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించాలన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, తూప్రాన్ అభివృద్ధి బాధ్యత తనదేనని, ఏ పని ఉన్నా చేసి పెడతానని హరీష్ రావు ప్రజలకు భరోసా ఇచ్చారు.

