బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శ
- క్యాతన్‌పల్లి ఎన్నికలపై కాంగ్రెస్‌పై ఆరోపణలు
- రాజ్యాంగ పరిరక్షణపై గవర్నర్ స్పందించాలని డిమాండ్
ఆదిలాబాద్, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోనే జైళ్లు ఉన్నప్పటికీ వారిని దూర ప్రాంతమైన ఆదిలాబాద్‌కు తరలించడం కక్షపూరిత చర్య అని విమర్శించారు. క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, చైర్మన్ ఎన్నికను కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసు బందోబస్తు లేకుండా చేసి ఎన్నిక వాయిదా పడేలా కుట్ర పన్నారని తెలిపారు.
దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యాలు జరిగాయని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం సేవించి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని, కానీ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజా తీర్పును కాలరాయడం సరికాదని హరీశ్ రావు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు.
