ఏపీ బడ్జెట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు
ఏపీ బడ్జెట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు
- అంకెల గారడీతో పసలేని బడ్జెట్ అన్న వ్యాఖ్య
- మహిళా సాధికారత, ఉపాధి హామీపై ప్రశ్నలు
- అప్పుల అంశంలో వాస్తవాలు వక్రీకరిస్తున్నారన్న ఆరోపణ
అమరావతి, 14 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందతో నిండిపోయిందని, ఇది అంకెల గారడీతో కూడిన పసలేని బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదేపదే ప్రస్తావించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న ధైర్యం, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని అభివర్ణించారు. మహిళా సాధికారత పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేస్తామనడం వాస్తవాలకు దూరమని అన్నారు. గతంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు పావలా వడ్డీ, సున్నా వడ్డీ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సున్నా వడ్డీ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేవని, ప్రస్తుతం ఆ పథకం ఎక్కడుందో తెలియదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఆ పథకానికి కేటాయింపులు కనిపించడంలేదని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపులో కోత పెట్టారని బొత్స ఆరోపించారు. కేంద్రం నిబంధనలు మారడంతో రాష్ట్రం కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే చూపించారని అన్నారు. దీంతో ఈ పథకాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా అని ప్రశ్నించారు. ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలోనూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని బొత్స ఆరోపించారు. రాష్ట్ర విభజన నుంచి రూ.9.46 లక్షల కోట్ల అప్పులు వచ్చాయని చెప్పడం సత్యదూరమని అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్లతో కలిపి రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్ల అప్పు చేసిందని వివరించారు. ఈ బడ్జెట్‌లో నిర్దిష్ట కేటాయింపులు, ప్రజలకు భరోసా కలిగించే అంశాలు లేవని ఆయన విమర్శించారు.
