మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు : తలసాని ఆరోపణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు : తలసాని ఆరోపణ
- డబ్బు, మద్యం ప్రవాహంపై విమర్శలు
- పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన అంటున్న మాజీ మంత్రి
- కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్న వ్యాఖ్య
సిద్దిపేట, 14 ఫిబ్రవరి 2026 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ పలు దౌర్జన్యాలకు పాల్పడిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం ఏరులై పారించారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుడ్డిలో మెల్లలాగా కాంగ్రెస్ గెలిచిందని, అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాటం చేసి సత్తా చాటారని కొనియాడారు. రాజకీయాల్లో ప్రభుత్వాలు శాశ్వతం కావని, ప్రజలే శాశ్వతమని తలసాని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని విమర్శించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి పురుషులకు చార్జీలు పెంచారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించారని, రైతులకు పంట సాయం అందించారని గుర్తుచేశారు. తాను టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఐదు గంటలకంటే ఎక్కువ విద్యుత్ రాకపోయేదని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ ప్రభుత్వంలో దెబ్బతిందని, కేసీఆర్ కాలంలో భూముల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో హరీష్ రావు పాత్ర కీలకమని ప్రశంసించారు.
Comments
