రైల్వే అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతులు
రైల్వే అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతులు
- కొత్త రైల్వే లైన్ మంజూరుపై విజ్ఞప్తి
- డెమూ రైలు సర్వీస్ ప్రారంభించాలని డిమాండ్
- రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు ప్రయోజనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):
పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికుల ప్రయోజనార్థం రైల్వే వ్యవస్థలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ఈరోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతులు సమర్పించారు. ఈ భేటీలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి ప్రకాశం జిల్లా దర్శి, అద్దంకి, ఒంగోలు మీదుగా రామాయపట్నం పోర్ట్ వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వ్యవసాయాధారిత ఈ ప్రాంతంలో ఎగుమతులకు అనుకూలమైన పంటలు, అనుబంధ ఉత్పత్తులు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ఈ రైల్వే లైన్ అమలులోకి వస్తే రామాయపట్నం పోర్ట్‌కు సరుకు రవాణా వేగవంతమవడంతో పాటు ప్రయాణికుల రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని, చెన్నై–సికింద్రాబాద్ మధ్య రైల్వే దూరం తగ్గి ప్రాంతీయ అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
అలాగే నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే మార్గంలో సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా కనిగిరి వరకు ప్రయాణికుల సౌకర్యార్థం డెమూ రైలు సర్వీసును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్–కనిగిరి మధ్య నేరుగా రైలు సర్వీస్ లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గం ప్రారంభమైనప్పటికీ పూర్తి విద్యుదీకరణ ఇంకా జరగలేదని, ఈ నేపథ్యంలో డెమూ రైలు సర్వీస్ ప్రారంభించడం తక్షణ పరిష్కారమని తెలిపారు. భవిష్యత్తులో విద్యుదీకరణ పూర్తయ్యాక ఈ సర్వీసును మెము రైలు సర్వీస్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చని సూచిస్తూ, ఈ అంశాలపై తక్షణమే చొరవ చూపాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.
