హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్
- ఎనిమిది పట్టణాలకు ఇన్‌ఛార్జుల నియామకం
- ఎన్నికలు సాఫీగా నిర్వహించడమే లక్ష్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది కీలక పట్టణాలకు సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు.
ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. స్థానిక నాయకత్వానికి పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను వెంటనే క్షేత్రస్థాయికి పంపినట్లు తెలిపారు.
రేపు ఎన్నికలు జరగనున్న ఎనిమిది మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ పట్టణాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని పార్టీ ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేసింది. ఇన్‌ఛార్జుల వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూర్‌కు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. జనగామకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. క్యాతనపల్లికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియమితులయ్యారు. ఇంద్రేశంకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాగజ్ నగర్‌కు మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్‌కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఇబ్రహీంపట్నంకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇన్‌ఛార్జులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు.
