స్టాక్ మార్కెట్‌లకు షాకిచ్చిన ఐటీ.. భారీగా నష్టపోయిన సూచీలు
స్టాక్ మార్కెట్‌లకు షాకిచ్చిన ఐటీ.. భారీగా నష్టపోయిన సూచీలు
ముంబై – ఫిబ్రవరి 12 – పీపుల్స్ మోటివేషన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో జనవరి నెలకు సంబంధించిన అంచనాల కంటే మెరుగైన జాబ్స్ డేటా వెలువడడంతో.. ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయని భావించిన మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు.
దీనికి తోడు ఐటీ రంగాన్ని ఏఐ ప్రభావం మరియు భవిష్యత్ ఆర్డర్లపై ఉన్న అనిశ్చితి వెంటాడింది. ఇటీవల గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న ఐటీ స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీల పతనానికి కారణమైంది. ఫెడ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగితే అమెరికన్ కంపెనీలు ఖర్చులను తగ్గించే అవకాశం ఉండటంతో భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం మేర క్షీణించింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు తగ్గినట్లు అంచనా.
సెన్సెక్స్ గురువారం 83,968.43 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై రోజంతా ఒత్తిడిలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 83,516.67 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 558.72 పాయింట్లు కోల్పోయి 83,674.92 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.61 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, బీఈఎల్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 5064 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
