ఇండియాతో మ్యాచ్‌కు ఒప్పుకున్న పాక్‌పై హర్భజన్ సెటైర్లు
ఇండియాతో మ్యాచ్‌కు ఒప్పుకున్న పాక్‌పై హర్భజన్ సెటైర్లు
కొలంబో, ఫిబ్రవరి 11 – పీపుల్స్ మోటివేషన్
టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొదట భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించి, తర్వాత మళ్లీ అంగీకరించడం పాక్ వైఖరిపై ప్రశ్నలు రేపుతోందని ఆయన అన్నారు.
టోర్నమెంట్ ప్రారంభం కాకముందే ఈ మ్యాచ్‌పై తీవ్ర చర్చలు సాగాయి. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు స్థాయి ప్రకటనలతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఐసీసీ జోక్యంతో టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది.
ఈ నిర్ణయంపై స్పందించిన హర్భజన్ సింగ్, “రోజుకో మాట, గంటకొక స్టేట్‌మెంట్ ఎందుకు? ఇంత ఓవరాక్షన్ అవసరమా?” అంటూ ఎద్దేవా చేశారు. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టమని, ఆ విషయం పీసీబీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. భారత్‌పై ఆధారపడకుండా పాకిస్థాన్ క్రికెట్ కొనసాగడం కష్టమని, కానీ భారత్ మాత్రం ఎప్పుడూ పాక్‌పై ఆధారపడదని అన్నారు.
ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్‌లో ఉండగా, పాకిస్థాన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 15న జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
