పెడకాకాని రైల్వే స్టేషన్‌లో హత్య కేసు ఛేదనం
పెడకాకాని రైల్వే స్టేషన్‌లో హత్య కేసు ఛేదనం
- గ్యాంగ్ లీడర్‌ను ముఠా సభ్యులే హతమార్చిన ఘటన
- చోరీ సొత్తు పంపకాలపై తలెత్తిన వివాదం
- సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్‌తో పోలీసులు కేసు ఛేదన
గుంటూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వే స్టేషన్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేరళకు చెందిన పరమడం అనీష్ అలియాస్ బ్లేడ్‌ను అతని ముఠా సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లలో చోరీలకు పాల్పడే ఈ గ్యాంగ్‌లో తమిళనాడుకు చెందిన కుమార్, కేరళకు చెందిన దీపేష్, అనంతపురానికి చెందిన వెంకటేష్ సభ్యులుగా ఉన్నారు. ప్రయాణికుల జేబులు కత్తిరించడం, చోరీలు చేయడం ఈ ముఠా ప్రధాన కార్యకలాపాలుగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు నాయకుడిగా ఉన్న అనీష్ దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారిపై బ్లేడ్‌తో దాడి చేయడం వల్ల అతనికి ‘బ్లేడ్’ అనే పేరు వచ్చింది. చోరీల ద్వారా వచ్చిన డబ్బును సభ్యుల మధ్య పంచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో ముఠా నాయకుడైన అనీష్ చోరీ సొమ్ములో ఎక్కువ భాగం తనకే ఇవ్వాలని మిగతా సభ్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అదనంగా బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. ఈ పరిస్థితులతో విసిగిపోయిన మిగతా ముగ్గురు సభ్యులు అతన్ని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మార్చి నాలుగో తేదీన ముగ్గురు సభ్యులు గుంటూరుకు వచ్చి అనీష్‌ను సంప్రదించారు. అందరం కలిసి మద్యం సేవిద్దామని చెప్పి అతన్ని పెదకాకాని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత పెదకాకాని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అనీష్ మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన ముగ్గురు అతనిపై దాడి చేశారు. ముందుగా బండరాయితో తలపై బలంగా కొట్టి, అనంతరం గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్ కాల్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తొలుత మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తి అని భావించినప్పటికీ తరువాత ఆధారాల ఆధారంగా అసలు వివరాలను గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. చోరీ సొత్తు పంపకాలపై తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని ఆయన వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
