పైప్డ్ గ్యాస్‌కు ప్రాధాన్యం.. కొత్త పాలసీపై ప్రభుత్వం సిద్ధం
పైప్డ్ గ్యాస్‌కు ప్రాధాన్యం.. కొత్త పాలసీపై ప్రభుత్వం సిద్ధం
ఎల్పీజీ నుంచి పైప్డ్ గ్యాస్ వైపు మళ్లింపు ప్రయత్నం
ఓటీపీ ద్వారానే గ్యాస్ సరఫరా.. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం
అమరావతి, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): పట్టణాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వైపు వినియోగదారులను మళ్లించేలా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
గ్యాస్ సరఫరాలో పారదర్శకత కోసం ఇకపై వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 800 కేసులు నమోదు చేసి 3,540 సిలిండర్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు అధికంగా గ్యాస్ బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. సాధారణంగా 2.4 లక్షల బుకింగ్స్ ఉండగా, ప్రస్తుతం 5 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
పైప్డ్ గ్యాస్ కనెక్టివిటీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.34 లక్షల మంది పైప్డ్ గ్యాస్ వినియోగిస్తున్నారని, పట్టణాల్లో మరిన్ని పైపులు వేసి ఇంటింటికీ కనెక్టివిటీ కల్పించనున్నట్లు చెప్పారు. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సరఫరాను కేంద్రం 10 నుంచి 20 శాతం పెంచిందని వెల్లడించారు.
రెస్టారెంట్లు, విద్యాసంస్థలకు గ్యాస్ సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే సోలార్, ఇండక్షన్ కుకింగ్ విధానాలను ప్రోత్సహించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
