అనకాపల్లి పోలీసు శాఖలో రిటైర్డ్ అధికారులకు ఘన వీడ్కోలు
అనకాపల్లి పోలీసు శాఖలో రిటైర్డ్ అధికారులకు ఘన వీడ్కోలు
- దశాబ్దాల సేవలకు గౌరవ సత్కారం
- ఆత్మీయ వాతావరణంలో వీడ్కోలు సభ నిర్వహణ
- పోలీసు సేవలకు ప్రశంసలు, భవిష్యత్తుకు శుభాకాంక్షలు
అనకాపల్లి, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయంగా వీడ్కోలు సభ నిర్వహించారు. పోలీసు వృత్తిలో క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ ద్వారా ఆదర్శంగా నిలిచిన ఈ అధికారులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారిలో అదనపు ఎస్సై బి. మల్లికార్జున రావు (దేవరపల్లి పోలీస్ స్టేషన్), ఏఆర్ఎస్ఐ పి. సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటరావు (పరవాడ పోలీస్ స్టేషన్) ఉన్నారు. వీరు తమ సేవా కాలంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు విశేష సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, రిటైర్డ్ అధికారులను వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని, అలాంటి బాధ్యతాయుతమైన రంగంలో 42 ఏళ్లు మరియు 35 ఏళ్లపాటు నిబద్ధతతో పనిచేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రత కోసం వారు చేసిన కృషి శాఖకు గర్వకారణమని తెలిపారు. పోలీసు సేవలో వారి అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత కొత్త తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపాలని అదనపు ఎస్పీ ఆకాంక్షించారు. రిటైర్డ్ అయినప్పటికీ పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఓ సి.హెచ్. తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు లక్ష్మి, మన్మథరావు, ఆఫీస్ సూపరింటెండెంట్లు దేవరాజు, ప్రతాప్ శేషయ్య, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
