అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు
- ఎస్‌ఐడీఎం స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు
- ముందస్తు సన్నద్ధతతో నష్టాల తగ్గింపు లక్ష్యం
- అత్యాధునిక పరికరాలతో విపత్తు నిర్వహణ బలోపేతం
హైదరాబాద్, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, అగ్నిమాపక శాఖ, ఎస్‌డిఆర్ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
విపత్తులు సంభవించినప్పుడు కేవలం సహాయక చర్యలకే పరిమితం కాకుండా, ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించడం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ (ఎస్‌ఐడీఎం) స్థాపనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విపత్తుల నిర్వహణలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలపాలంటే అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వేగవంతమైన స్పందన వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్, ఖచ్చితమైన సమాచార వ్యవస్థ, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. అత్యాధునిక పరికరాల కొనుగోలు, డ్రోన్‌లు, హైస్పీడ్ బోట్లు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. విపత్తుల నివారణలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రాణ, ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐసిసిసి డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, స్పెషల్ పోలీస్ బెటాలియన్ అదనపు డీజీ సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
