గ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లో హోటల్ రంగం ఆందోళన
గ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లో హోటల్ రంగం ఆందోళన
- వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేత ప్రభావం
- హోటళ్ల బంద్‌కు హెచ్చరికలు
- ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల హోటల్ రంగంపై కూడా పడుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఆదేశించడంతో హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పలు హోటళ్లు తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్‌లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరత సమస్యకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్‌కు దిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. విశాఖపట్నంలో వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. సిలిండర్ల సరఫరా మరింత తగ్గే అవకాశముందని, ఇప్పటికే కొన్నిచోట్ల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతపై విశాఖ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు హోటల్ వ్యాపారులు తెలిపారు. హోటల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు.
