గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీం చారిత్రాత్మక తీర్పు…
గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీం చారిత్రాత్మక తీర్పు…
- 13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న హరీశ్ రాణా కేసులో కీలక నిర్ణయం
- లైఫ్ సపోర్ట్ నిలిపివేయడానికి తల్లిదండ్రులకు అనుమతి
- పోషకాహారం కూడా వైద్య చికిత్సలో భాగమేనని స్పష్టం
- రోగి కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదికల ఆధారం
న్యూఢిల్లీ, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్): గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేయడానికి అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా గౌరవ మరణం అంశంపై కీలక చర్చకు దారితీసే అవకాశం ఉంది. హరీశ్ రాణా 13 సంవత్సరాల క్రితం భవనం పై నుంచి పడిపోవడంతో అతని మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కొనసాగించడం రోగి ప్రయోజనాలకు అనుకూలమా కాదా అనే అంశాన్ని పరిశీలించడం అత్యంత ముఖ్యమని పేర్కొంది.
గత 13 సంవత్సరాలుగా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయని కోర్టు తెలిపింది. కోలుకునే అవకాశాలు కూడా లేవని వైద్యులు వెల్లడించడంతో చికిత్సను కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది. చదువులో చురుకుగా ఉన్న యువకుడు ఇలా జీవచ్ఛవంగా మారడం బాధాకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పైపుల ద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్సలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల బృందం పరిశీలించి రోగి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన పక్షంలో లైఫ్ సపోర్ట్‌తో పాటు పోషకాహారాన్ని కూడా నిలిపివేయవచ్చని ఈ తీర్పుతో స్పష్టత వచ్చింది. ఈ తీర్పు గౌరవ మరణం హక్కుపై న్యాయపరమైన చర్చలకు కొత్త దారులు చూపించనుంది.
