అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: హైడ్రా కమిషనర్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: హైడ్రా కమిషనర్
- బాచుపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలన
- వేసవిలో అగ్నిప్రమాదాల ప్రమాదం ఎక్కువ
- ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచన
హైదరాబాద్, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. బాచుపల్లి ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫర్నిచర్ దుకాణాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై అక్కడి దుకాణాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పు రవ్వలు దుకాణాలకు అంటుకోవడంతో మంటలు వ్యాపించినట్లు కొందరు తెలిపారు. మరికొందరు పైగా వెళ్తున్న విద్యుత్ తీగ తెగి మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్ వేసవిలో అగ్నిప్రమాదాల ప్రమాదం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్నిప్రమాదాలు ఎందుకు జరుగుతాయో అవగాహన పెంపొందించుకుని వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బాచుపల్లి ఘటనలో 22కి పైగా ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఒక్కో దుకాణంలో సుమారు రూ.25 లక్షలకు పైగా విలువైన సామగ్రి ఉండటంతో వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. నష్టపరిహారం అంశాన్ని రెవెన్యూ శాఖ పరిశీలిస్తుందని వెల్లడించారు. తనిఖీలు మాత్రమే సరిపోవని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించినప్పుడే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని హైడ్రాకు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు.
Comments
