అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
- మొబైల్ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు
- సీసీ కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ
- ఏప్రిల్ 1 నుంచి ఓటిపీఎస్ ద్వారా మాత్రమే ఇసుక సరఫరా
సూర్యాపేట, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలతో ప్రత్యేక మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు.
ప్రతి ఇసుక రీచ్ వద్ద హైటెక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అక్రమాలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని, ఇకపై మాన్యువల్ అనుమతులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం ఓటిపీఎస్ (ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్) ద్వారా మాత్రమే ఇసుక సరఫరా జరుగుతుందని తెలిపారు. ఇది పారదర్శకతకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా సకాలంలో సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమ రవాణాలో పాల్గొనే వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
