ప్రభుత్వంపై శైలజనాథ్ విమర్శలు
ప్రభుత్వంపై శైలజనాథ్ విమర్శలు
- పంట నష్టాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్
- మద్దతు ధర లేక రైతుల ఆందోళన
- రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక
మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. వర్షాలు పడటం సంతోషకరమైనదే అయినా, పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతన్న ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాడని, కానీ ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని విమర్శించారు. శింగనమల నియోజకవర్గంలోనే దాదాపు 160 ఎకరాల మొక్కజొన్న పంట, 90 ఎకరాల అరటి పంట అకాల వర్షాలకు దెబ్బతిన్నట్లు తెలిపారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. తడిసిన పంటలను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 అయినప్పటికీ, మార్కెట్లో రూ.1600కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. దళారుల ఆధిపత్యంతో రైతులు నష్టపోతున్నారని, పండించిన పంటను ఇళ్ల దగ్గరే నిల్వ చేసుకునే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.30 నుంచి రూ.40 వేల వరకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇక రైతుల కోసం పోరాటంలో తమ పార్టీ ముందుంటుందని శైలజనాథ్ స్పష్టం చేశారు. నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
