అద్దంకిలో జగన్ కీలక సమావేశం.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
అద్దంకిలో జగన్ కీలక సమావేశం.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
- చంద్రబాబుపై క్రెడిట్ చోరీ ఆరోపణలు
- ‘జగన్ 2.0’తో పార్టీ పునర్వ్యవస్థీకరణ సంకేతాలు
- మహిళా రిజర్వేషన్లతో కొత్త అవకాశాలు వస్తాయని వ్యాఖ్యలు
ప్రకాశం, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలనలో ప్రతి అంశాన్ని తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకు కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చినదని, కానీ ఇప్పుడు అది తన వల్లే వచ్చిందని చెప్పడం సరైంది కాదని అన్నారు.
గూగుల్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొన్నదని జగన్ పేర్కొన్నారు. మాటలు ఎక్కువగా ఉన్నప్పటికీ, చేతల్లో పనులు కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఏర్పడుతోందని అన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దుతామని జగన్ తెలిపారు. ‘జగన్ 2.0’లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ప్రజల్లో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన పార్టీకి అనుకూల పరిణామమని జగన్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడం ద్వారా మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గతంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తుచేశారు. పార్టీ శక్తిని పెంచుతూ ముందుకు సాగాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేతలకు జగన్ పిలుపునిచ్చారు. రాబోయే రాజకీయ పరిణామాల్లో వైసీపీ మరింత బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
