రుణాల పంపిణీలో బ్యాంకులు ముందుండాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
రుణాల పంపిణీలో బ్యాంకులు ముందుండాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
- ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్య సాధనపై సమీక్ష
- అర్హులందరికీ విరివిగా రుణాలు అందించాలని ఆదేశాలు
- గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణకు సూచనలు
జగిత్యాల, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా డిసిసి–డిఎల్ఆర్సి కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన బ్యాంకింగ్ పనితీరును సమీక్షించారు. ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్య సాధనలో బ్యాంకులు ముందుండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. రుణాల మంజూరులో సమతుల్యత పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు.
స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందిస్తున్న రుణాలు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ అవసరమని తెలిపారు. పీఎం ఈజిపి, ముద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ వంటి పథకాల కింద రుణాల లక్ష్యాలను చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 31లోగా పీఎంఎఫ్ఎంఈ రుణాలను మంజూరు చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ కావాలంటే బ్యాంకింగ్ అవుట్లెట్స్, ఏటీఎంల సంఖ్య పెంచాలని సూచించారు. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు రుణాల పంపిణీ ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. రైతులకు సులభంగా రుణాలు అందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ గృహాల నిధుల నుంచి రికవరీ చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లను కోరారు. అనంతరం నాబార్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల లక్ష్యాల పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు, ఎల్డీఎం, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
