చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడ జననం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడ జననం
- ఇచ్చాపురం మండలంలో వింత ఘటన
- దేవుని మహిమగా భావిస్తున్న గ్రామస్తులు
- జన్యుపరమైన లోపమని వైద్యుల వివరణ
శ్రీకాకుళం, మార్చి 3 (పీపుల్స్ మోటివేషన్): డోలి పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకేసారి వచ్చిన రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ పరిధిలోని ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన పాడి రైతు కాళ్ళ తులసిదాస్ వద్ద ఉన్న సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను ప్రసవించింది. దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామంలో ఆసక్తి, ఆశ్చర్యం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వింత దూడను చూసేందుకు తరలివస్తున్నారు. పౌర్ణమి రోజున, అది కూడా మగ దూడ పుట్టడంతో దాన్ని దత్తాత్రేయ స్వామివారి ప్రతిరూపంగా భావిస్తూ కొందరు భక్తి భావంతో పూజలు చేస్తున్నారు. ఆవుకి, దూడకు హారతులు ఇస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. కొన్నిసార్లు అదనపు కాలు ఉన్న దూడలు జన్మించిన సందర్భాలు ఉన్నప్పటికీ, రెండు తలలతో దూడ పుట్టడం అరుదేనని పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే వైద్యులు ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలను ఖండిస్తున్నారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలాంటి దూడలు అరుదుగా జన్మిస్తాయని వెటర్నరీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దూడ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన వైద్య సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
