డ్రగ్స్ కేసుపై కఠినంగా చంద్రబాబు
డ్రగ్స్ కేసుపై కఠినంగా చంద్రబాబు
- పుట్టా మహేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలు
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచన
- పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడికి ఆదేశం
అమరావతి, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్): మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పార్టీ కార్యకలాపాలకు తక్షణమే దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అలాగే ఈ విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఆయన పేరుతో వచ్చిన ఆరోపణలపై సమగ్ర వివరణ తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కూడా చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశించారు. డ్రగ్స్ కేసులో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది అనే అంశాలపై పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. దీనిపై పార్టీ స్థాయిలో సమగ్రంగా పరిశీలన జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తుల వ్యక్తిగత తప్పిదాలు లేదా బలహీనతల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రగ్స్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
