Health news: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?..
Health news: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?..
- మెదడుపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది
- డిజిటల్ ఒత్తిడితో మానసిక ఆందోళన
- మంచి అలవాట్లతో రోజు ప్రారంభించాలని నిపుణుల సూచన
11 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ప్రస్తుత కాలంలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే మొబైల్ ఫోన్ చూడడం అలవాటుగా మారింది. ముందుగా సందేశాలు, ఆ తర్వాత సామాజిక మాధ్యమాలు లేదా వార్తలను చూసే ప్రక్రియ కొంతసేపు కొనసాగుతుంది. అయితే ఇలా నిద్రలేవగానే ఫోన్ చూడడం ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల స్థాయిల నుంచి మెదడు పనితీరు వరకు పలు అంశాలపై ఇది ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం సమయం మెదడు చురుకుగా పనిచేసే సమయం. ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. కానీ నిద్రలేవగానే మొబైల్ స్క్రీన్ చూస్తూ సందేశాలు, సామాజిక మాధ్యమాలను పరిశీలించడం వల్ల మెదడుకు ఒక్కసారిగా ఎక్కువ సమాచారం చేరుతుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పెరిగి రోజంతా అలసటగా అనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం ఫోన్ వినియోగం శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సందేశాలు లేదా వార్తలు ఆందోళన కలిగించేలా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఇతరుల విజయాలు, ఆనందకర క్షణాలను చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల కూడా ఆందోళన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని డిజిటల్ ఒత్తిడి అని పిలుస్తారు. అధికంగా ఫోన్ వాడటం వల్ల కళ్లపై కూడా ప్రభావం పడుతుంది. తలనొప్పి, కళ్లలో నీరు కారడం, కంటి నొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి నిద్రలేవగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో లైట్ వ్యాయామం చేయడం, నీళ్లు తాగడం, ప్రశాంతంగా శ్వాస వ్యాయామం చేయడం వంటి మంచి అలవాట్లు అలవాటు చేసుకుంటే రోజు సానుకూలంగా ప్రారంభమవుతుందని వారు చెబుతున్నారు.
