అమరావతికి చట్టబద్ధత రైతుల త్యాగానికి న్యాయం
అమరావతికి చట్టబద్ధత రైతుల త్యాగానికి న్యాయం
- చారిత్రాత్మక నిర్ణయంపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పందన
- రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది
- రైతుల త్యాగం, ప్రజల విశ్వాసమే అమరావతి బలం
గుంటూరు, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, నాగరికతకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 29 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రైతుల త్యాగం, మహిళల దీక్ష, ప్రజల విశ్వాసమే అమరావతి నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతిని మూడు భాగాలుగా విభజించే ప్రయత్నం రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. ఐదేళ్ల అమూల్యమైన సమయం వృథా అయిందని, రైతుల పోరాటం 1631 రోజుల పాటు కొనసాగడం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని వివరించారు.
రాజధాని నిర్మాణం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా తరతరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సినదని ఆమె అన్నారు. అమరావతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మారబోతుందని, ప్రస్తుతం 56 వేల కోట్ల రూపాయలతో 91 మౌలిక వసతుల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.
పెట్టుబడులు ఆకర్షించాలంటే స్థిరత్వం, స్పష్టత అవసరమని, అమరావతి ఆ నమ్మకాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం మద్దతు, రాష్ట్ర నాయకత్వ దూరదృష్టి కలిసి అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ కృషిని కూడా అభినందించారు. అమరావతి నిర్మాణం రైతుల త్యాగానికి న్యాయం చేయడమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని గళ్ళా మాధవి పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
