యాసంగి ధాన్యం కొనుగోళ్లపై విస్తృత సమీక్ష
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై విస్తృత సమీక్ష
- 435 కొనుగోలు కేంద్రాలతో భారీ ప్రణాళిక
- రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో సమన్వయం కీలకం
జగిత్యాల, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): యాసంగి (రబీ) 2025–26 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్‌లో దాదాపు 4,83,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో 136 కేంద్రాలు, ప్యాక్స్ ద్వారా 287 కేంద్రాలు, మేప్మా ద్వారా ఒక కేంద్రం కలిపి మొత్తం 435 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉందని, అదే విధంగా ఈ రబీ సీజన్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైస్ మిల్లర్లు ధాన్యం నిల్వల కోసం ముందస్తుగా సన్నద్ధం కావాలని, మిల్లులకు వచ్చే లారీలను వేగంగా ఖాళీ చేయాలని మంత్రి సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే పౌర సరఫరా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మిల్లర్లు సహకరించాలని కోరారు.
ఈసారి ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే అవకాశమున్నందున రవాణా సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా ట్రాన్స్పోర్టర్లు వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత సిబ్బంది నిరంతరం కేంద్రాలను సందర్శిస్తూ ఏర్పాట్లు పరిశీలించాలని, రోజువారీ నివేదికలను జిల్లా కేంద్రానికి అందించాలని సూచించారు.
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరిన వెంటనే నియమ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తిచేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, ట్రాన్స్పోర్టర్లు పాల్గొన్నారు.
